పదిలో మెరిసిన ప్రకాశం | Prakasam District First Place In Tenth Percentage | Sakshi
Sakshi News home page

పదిలో మెరిసిన ప్రకాశం

Published Mon, Apr 30 2018 11:51 AM | Last Updated on Mon, Apr 30 2018 11:51 AM

Prakasam District First Place In Tenth Percentage - Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రకాశం జిల్లా మొదటి స్థానం సాధించింది. రాష్ట్ర విద్యాశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. ప్రకాశం జిల్లా 97.93 శాతం ఉత్తీర్ణతలో మొదటి స్థానం సాధించినట్లు ప్రకటించారు. పది ఉత్తీర్ణతలో జిల్లాకు మొదటి స్థానం దక్కడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, అటు విద్యాసంస్థలు, ఉపాధ్యాయ వర్గాల్లోనూ ఆనందం వెల్లివిరిసింది. 2007లో 10వ తరగతి ఉత్తీర్ణతలో ప్రకాశం జిల్లాకు మొదటి స్థానం దక్కింది. ఆ తర్వాత పది సంవత్సరాలకు మరోమారు జిల్లా మొదటి స్థానం దక్కించుకుంది. జిల్లా వ్యాప్తంగా 180 పరీక్ష కేంద్రాల పరిధిలో 38,642 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయగా 37,841 మంది ఉత్తీర్ణత సాధించారు.

19,780 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా 19,361 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక 18,862 మంది బాలికలు పరీక్షలు రాయగా 18,480 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురలో 419 మంది, బాలికల్లో 382 మంది మాత్రమే ఫెయిలయ్యారు. 2,087 మంది విద్యార్థులు 10 పాయింట్లు సాధించారు. 2017 విద్యా సంవత్సరంలో 1060 మంది విద్యార్థులు 10 పాయింట్లు సాధించగా ఈ ఏడాది సంఖ్య రెట్టింపయింది. గతంతో పోలిస్తే 8 శాతంకుపైగా పాస్‌ పర్సంటేజీ పెరిగినట్లు విద్యాశాఖాధికారులు ప్రకటించారు. 2016 ఏడాదిలో 90.50 శాతం ఉత్తీర్ణత సాధించగా 2017లో 91.78 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది అది ఏకంగా 97.93 శాతానికి పెరిగింది.

నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన పొతకమూరు జడ్పీ పాఠశాల
పదవ తరగతి ఫలితాల్లో దర్శి మండలం పొతకమూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నూరు శాతం ఉత్తీర్ణత సాధించింది. 38 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయగా 38 మంది పాసయ్యారు. చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన ఝాన్సీ అత్యధికంగా 9.7 పాయింట్లు సాధించారు. మిగిలిన వారిలో ఇద్దరు విద్యార్థులు 9.5, ముగ్గురు 9.3, ఒక విద్యార్థి 9.2, ఒక విద్యార్థి 9.0 పాయింట్లు సాధించటం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలలో నూరు శాతం ఉత్తీర్ణతను సాధించటం పట్ల విద్యాశాఖ వారిని అభినందించింది. ఇది ప్రభుత్వ పాఠశాలలకు, ఉపాధ్యాయులకు మరింత స్ఫూర్తిగా నిలుస్తుందని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

అందరి కృషితోనే జిల్లాకు ప్రథమస్థానం
ఒంగోలు టూటౌన్‌: అందరి కృషితోనే పదో తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిపామని జిల్లా విద్యాశాఖాధికారి వీఎస్‌ సుబ్బారావు తెలిపారు. పదవ తరగతి ఫలితాలు విడుదలైన సందర్భంగా తన ఛాంబర్‌లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నుంచి మొత్తం 38,642 మంది విద్యార్థులు హాజరుకాగా 37,841 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. వీరిలో బాలురు 97.88 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలికలు 97.97 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. 2,087 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారన్నారు. గత ఏడాది 91.78 శాతం ఉత్తీర్ణత సాధించి 10వ స్థానంలో నిలవగా ఈ ఏడాది 97.93 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలవడం గర్వంగా ఉందన్నారు. విద్యలో వెనకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ అవర్లు ఏర్పాటు చేసి చదివించామన్నారు. ప్రతి హాస్టల్‌ను రాత్రిళ్లు తనిఖీ చేసి వార్డెన్ల చేత చదివించామన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రధానోపాధ్యాయులు, టీచర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు తెలిపారు. అందరి కృషితోనే పదేళ్ల తరువాత జిల్లా ప్రథమస్థానంలో నిలిచినట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్వశిక్షఅభియాన్‌ పీఓ ఎం. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం విద్యాశాఖ కార్యాలయం ఎదురుగా బాణసంచా కాల్చారు. తరువాత వివిధ పాఠశాలల హెచ్‌ఎంలు, టీచర్లు, ఉపాధ్యాయల సంఘాల నాయకులు విద్యాశాఖాధికారిని అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement