ఎమ్మెల్సీలకు పదవీ గండం! | no mlc's if telangana state is formed | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీలకు పదవీ గండం!

Published Sat, Aug 31 2013 2:48 AM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM

no mlc's if telangana state is formed

ఖమ్మం, న్యూస్‌లైన్: ఎమ్మెల్సీలకు పదవీ గండం పొంచి ఉందా...ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో సర్వత్రా జరుగుతున్న చర్చ ఇది.  ఏదైనా ఒక రాష్ట్రంలో శాసన మండలి ఉండాలంటే ఆ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 120కి పైగా ఉండాలని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. లేకపోతే అక్కడి మండలి రద్దు చేయాల్సిందే అని చెబుతున్నారు. ఈ లెక్కన 10జిల్లాలతో ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో కేవలం 119  అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. శాసనమండలి ఉండాలంటే ఒకస్థానం తక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో సరిపడా సంఖ్య లేనందున రాష్ట్ర శాసన మండలి రద్దు అనివార్యం అని రాజ్యాంగ విశ్లేషకులు చెబుతున్నారు. పార్లమెంట్‌లో ప్రత్యేక సవరణ చేసి బిల్లు పాస్ చేస్తే తప్ప ప్రత్యేక రాష్ట్రంలో శాసన మండలి ఉండే అవకాశం లేదు. దీంతో జిల్లాలో  ఐదుగురు మండలి సభ్యులకు పదవీగండం పొంచి ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
 
 శాసనమండలి రద్దు పరిస్థితే వస్తే... శాసనసభ్యుల కోటాకింద టీడీపీ నుంచి ఎంపికైన బాలసాని లక్ష్మీనారాయణ, స్థానిక సంస్థల సభ్యుల కోటాలో ఎంపికైన పోట్ల నాగేశ్వరరావు, ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఎంపికైన కపిలవాయి దిలీప్‌కుమార్‌లు అటుఇటుగా పదిహేను నెలలకు ముందుగానే పదవిని వదులుకోవాల్సి ఉండగా, రెండోసారి మండలికి ఎంపికైన పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఐదుసంవత్సరాల పదవీకాలం కోల్పోయే పరిస్థితి తలెత్తనుంది. ఇక ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎంపికైన పూలరవిందర్ పదవి మూనాళ్ల ముచ్చటగానే మారొచ్చని అంటున్నారు. ఇటువంటి పరిస్థితిలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై సంతోషంగా ఉండాలో పదవి పోతున్నందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో మన నాయకులు కొట్టుమిట్టాడుతున్నారు.
 
 రాజకీయ భవిష్యత్తుపై చర్చలు....
 పదవీకాలం ముగియక ముందే పదవిని కోల్పోయే పరిస్థితి నెలకొంటే నాయకుల రాజకీయ భవితవ్యం ఏమిటనే చర్చ నడుస్తోంది. 2004లో ఖమ్మం అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన బాలసాని లక్ష్మీనారాయణను ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికచేశారు. ఆయన పోటీచేసిన ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు 2009లో పోటీచేసి గొలుపొందారు. అదేవిధంగా పార్టీలో పనిచేసి అవకాశం కోసం ఎదురు చూస్తున్న పోట్ల నాగేశ్వరరావు  స్థానిక సంస్థల ప్రతినిధుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు వీరి రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్థకం. జిల్లాలో మూడు జనరల్ స్థానాలు ఉండగా పొత్తుల్లో భాగంగా ఏ పార్టీకి ఏ స్థానం కేటాయిస్తారో తేల్చిచెప్పలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో టీడీపీకి దక్కే ఒకటి, రెండు జనరల్ స్థానాల్లో తీవ్రమైన పోటీ నెలకొననుంది. అదేవిధంగా రెండోసారి మండలికి ఎంపికైన పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఎక్కడ ప్రాతినిధ్యం వహిస్తారో అనేది చర్చ.
 
  ఇటీవల ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం, పార్టీ సమావేశాల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి స్థానికులే పోటీ చేయాలని ఆయన చేసిన వ్యాఖ్యల వెనక రాజకీయ వ్యూహం ఉండివుంటుందని భావిస్తున్నారు. తనకు ఢిల్లీ పెద్దలతో ఉన్న సంబంధంతో ఆయన ఖమ్మం ఎంపీగా పోటీచేస్తారా.. అనే చర్చ లేకపోలేదు. ఖమ్మం, వరంగల్, నల్గొండ విద్యావంతుల నియోజవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కపిలవాయి దిలీప్‌కుమార్ టీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక కూటమితో ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో ఎన్నికల్లో పోటీ చేస్తారా? తనకు ఉన్న సంబంధాలతో మరో నామినేటెడ్ పదవి తెచ్చుకుంటారో వేచిచూడాలి. ఇక ఇంతకాలం ఉపాధ్యాయునిగా పనిచేసిన పూలరవిందర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ టీచర్స్ జేఏసీ కన్వీనర్‌గా పనిచేసి అందరితో పరిచయాలు పెంచుకున్నారు. ఇప్పుడు మండలి రద్దు అయితే రాజకీయ భవితవ్యం ఏమిటనేది ప్రశ్నార్థకం. రాజకీయాలకు దూరంగా ఉంటారా.. లేదా ఏదో ఒక పార్టీలో చేరి ప్రత్యామ్నాయం వెతుక్కుంటారా అనేది జిల్లాలో చర్చనీయాంశం.  
 

Advertisement
 
Advertisement
 
Advertisement