గురజాల నుంచే విజయఢంకా మోగిస్తాం : కాసు | Kasu Mahesh Reddy Said That YSRCC Will Be Successful In The Guruji Constituency | Sakshi
Sakshi News home page

గురజాల నుంచే విజయఢంకా మోగిస్తాం : కాసు

Published Fri, Mar 15 2019 12:18 PM | Last Updated on Fri, Mar 15 2019 12:18 PM

Kasu Mahesh Reddy Said That YSRCC Will Be Successful In The Guruji Constituency - Sakshi

సాక్షి, పిడుగురాళ్ల: గురజాల నియోజకవర్గం నుంచే వైఎస్సార్‌ సీపీ విజయఢంకా మోగిస్తామని పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి అన్నారు. పట్టణ సమీపంలోని ఆక్స్‌ఫర్డ్‌ కళాశాలలో పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 16వ తేదీన హెలికాప్టర్‌ ద్వారా ల్యాండ్‌ అయ్యే ప్రాంగణాన్ని గురువారం కాసు, పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ప్రోగ్రామ్‌ కన్వీనర్, పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ పరిశీలించారు.

ఈ సందర్భంగా కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ  వైఎస్సార్‌ సీపీ గెలుపు శంఖారావం గురజాల నియోజకవర్గం నుంచే ప్రారంభమవుతుందన్నారు. పల్నాడు ప్రాంత ప్రజలపై జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న అభిమానంతో పల్నాడు ప్రాంతంలోని పిడుగురాళ్ల నుంచే ప్రచార సభ ఏర్పాటు చేశారని తెలిపారు. ఆయన రాక పల్నాడు ప్రజల అదృష్టమని భావిస్తున్నామన్నారు. గురజాల నియోజకవర్గానికి ప్రత్యేకమైన మేనిఫెస్టోను జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా విడుదల చేస్తామన్నారు.

గురజాల నియోజకవర్గంలో మెడికల్‌ కళాశాల నిర్మించి అందులోనే హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తామని, అదే విధంగా ఇంజినీరింగ్‌ కళాశాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. కృష్ణానది పక్కనే ఉన్నప్పటికీ టీడీపీ నాయకులు ప్రజలకు తాగునీరు అందించలేకపోయారని విమర్శించారు. కేవలం పేకాట క్లబ్‌లు, మట్టి మాఫియా, క్వారీలను దోచుకోవడం, వ్యాపారులను ఇబ్బంది పెట్టడం, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడతారని వివరించారు.

లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ పౌరుషాల పురిటిగడ్డ అయిన పల్నాడు ప్రాంతం నుంచి సమర శంఖారావం పూరించబోతున్నారన్నారు. పల్నాడు ప్రాంతం నుంచి ఏ కార్యక్రమం మొదలు పెట్టినా అది జయప్రదం కావడం శుభపరిణామం అన్నారు. రాష్ట్రంలో టీడీపీని కూకటి వేళ్లతో పెకిలించడానికి వైఎస్సార్‌ సీపీ నడుం బిగించిందని, అందుకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చి సభను విజయవం తం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రేపాల శ్రీనివాసరావు, కుందుర్తి గురవాచా రి, జెడ్పీటీసీ వీరభద్రుని రామిరెడ్డి, ఎంపీటీసీ తాటికొండ చిన ఆంజనేయులురెడ్డి, పట్టణ అధ్యక్షుడు చింతా వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
Advertisement