స్తంభించిన వైద్య సేవలు | Junior Doctors Protest Stopped Health Services In Kurnool | Sakshi
Sakshi News home page

స్తంభించిన వైద్య సేవలు

Published Fri, Aug 9 2019 8:44 AM | Last Updated on Fri, Aug 9 2019 8:46 AM

Junior Doctors Protest Stopped Health Services In Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ బిల్లుకు వ్యతిరేకంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జూనియర్‌ డాక్టర్లు శుక్రవారం కొన్ని గంటల పాటు వైద్యసేవలు పూర్తిగా నిలిపివేశారు. ఆసుపత్రిలో రోగులకు ఓపీ టికెట్‌ కూడా ఇవ్వకుండా బంద్‌ చేయించారు. అనంతరం ఓపీ విభాగాల్లో వైద్యసేవలు అందిస్తున్న వైద్యులను బయటకు పంపించి తాళాలు వేశారు. ఓపీ విభాగాల నుంచి క్యాజువాలిటీకి చికిత్స కోసం వచ్చిన రోగులను సైతం సమ్మె తర్వాత రావాలంటూ తిప్పి పంపించారు. దీంతో పలువురు రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ ఆందోళన ఎవరి కోసం, ఎందుకోసం చేస్తున్నారు’ అంటూ జూనియర్‌ డాక్టర్లను ప్రశ్నించారు. సుదూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చే తమకు వైద్యాన్ని నిరాకరించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు.

‘మీ ఆందోళన కోసం రోగులను ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు.. వైద్యం చేయాలి’ అని వేడుకున్నారు. కనీసం మాత్రలను అయినా ఇచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో సమ్మెకు గల కారణాలను రోగులకు జూనియర్‌ డాక్టర్లు వివరించే ప్రయత్నం చేశారు. ‘మీ సమస్యలన్నీ మాకు అర్థం కావని, మాకు వైద్యం చేయాలి’ అని చేతులెత్తి రోగులు.. జూనియర్‌ డాక్టర్లను వేడుకున్నారు. ఇప్పటికిప్పుడు తామేమీ చేయలేమని సమ్మె అయిపోయాక రావాలంటూ వెనక్కి పంపించారు. కాగా ఓపీ కౌంటర్‌ వద్ద టికెట్లు ఇవ్వకపోవడంతో అక్కడ కూడా రోగులు తీవ్రంగా మండిపడ్డారు. అత్యవసర చికిత్సకోసం వెళ్లాలన్నా ఓపీ టికెట్‌ ఇవ్వాలని, అది కూడా ఇవ్వకుండా బంద్‌ చేస్తే ఎలాగంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా రోగులు, జూనియర్‌ డాక్టర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం పలువురు జూనియర్‌ డాక్టర్లు వార్డులకు పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ వెళ్లి విధుల్లో ఉన్న వైద్యులను కలిసి సమ్మెకు సహకరించాలని కోరారు. దీంతో పలువురు వైద్యులు వార్డుల నుంచి బయటకు వెళ్లారు. పలు విభాగాల్లో అడ్మిషన్‌లో ఉన్న రోగులను ఇంటికి పంపించారు. సమ్మె జరుగుతున్న కారణంగా పీజీ డాక్టర్లు విధులకు హాజరుకావడం లేదని, సమ్మె ముగిశాక రావాలంటూ డిశ్చార్జ్‌ చేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత తమకు ఏదైనా అనారోగ్య సమస్య ఎదురైతే ఎలాగంటూ పలువురు రోగులు వైద్యులను ప్రశ్నించారు.

కొండారెడ్డి బురుజు వద్ద రాస్తారోకో..
ఆసుపత్రిలో ఆందోళన చేసుకుంటూ అనంతరం వైద్య విద్యార్థులు ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ ఆసుపత్రి నుంచి మొదలై మెడికల్‌ కాలేజి, రాజ్‌విహార్, కిడ్స్‌వరల్డ్, పాత కంట్రోల్‌రూమ్‌ మీదుగా కొండారెడ్డి బురుజు వరకు చేరుకుంది.. అక్కడ వినూత్న తరహాలో రాస్తారోకో నిర్వహించారు. ఎన్‌ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో గంటపాటు నగరంలో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

ప్రైవేటు ఆసుపత్రుల బంద్‌ పాక్షికం

ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ, ఐపీ సేవలను స్తంభింపజేసిన వైద్యులు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో మాత్రం సేవలు కొనసాగించడం విమర్శలకు తావిస్తోంది. ఆసుపత్రిలో పనిచేసే అధిక శాతం వైద్యులకు ప్రైవేట్‌ ఆసుపత్రులు, క్లినిక్‌లు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు బహిష్కరించిన అనంతరం పలువురు వైద్యులు నేరుగా వారి క్లినిక్‌లు, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీశారు. అక్కడ చికిత్సకోసం వచ్చిన రోగులకు వైద్యం అందించారు. కాగా గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు ప్రైవేట్‌ ఆసుపత్రుల బంద్‌కు ఐఎంఏ పిలుపునిచ్చిన విషయం విదితమే. వీరి పిలుపు మేరకు నగరంలోని పలు ప్రైవేట్‌ ఆసుపత్రులు మాత్రమే బంద్‌ చేశాయి. అధిక శాతం ఆసుపత్రులు, క్లినిక్‌లను వైద్యులు తెరిచే ఉంచారు.

గర్భసంచిలో పుండు ఉంటే చికిత్స కోసం కడప నుంచి వారం క్రితం వచ్చి ఆసుపత్రిలో చేరింది. జూడాల సమ్మె కారణంగా ఆమెకు ఆపరేషన్‌ వాయిదా వేస్తూ వచ్చారు. ఎక్స్‌రే తీయించుకునేందుకు డబ్బులు చెల్లించాలని వస్తే ఓపీ కౌంటర్‌ మూసివేయడంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యింది. ఇంకా ఎన్నాళ్లు ఆపరేషన్‌ కోసం వేచి ఉండాలని ఆవేదన వ్యక్తం చేసింది.  సూరమ్‌ లక్ష్మీదేవి.

దొర్నిపాడు మండలం కొండాపురం గ్రామస్తుడు. కడుపులో గడ్డ ఉండటంతో చికిత్స కోసం వారం నుంచి ఆసుపత్రికి వచ్చి పోతున్నా చికిత్స చేసే నాథుడు లేడు. వ్యవసాయం చేసుకుని జీవించే తనకు ప్రైవేటు ఆసుపత్రిలో రూ.40వేలు పెట్టి ఆపరేషన్‌ చేయించుకునే స్థోమత లేదని, పెద్దాసుపత్రే తమకు దిక్కు అని, సమ్మె చేస్తే తనలాంటి వారి పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించాడు. - పీర్‌ మహమ్మద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement