టీడీపీలో గ్రూపుల గోల | Internal clash between TDP party leader in Vizianagaram | Sakshi
Sakshi News home page

టీడీపీలో గ్రూపుల గోల

Published Sun, Jul 16 2017 5:47 AM | Last Updated on Fri, Aug 10 2018 8:27 PM

టీడీపీలో గ్రూపుల గోల - Sakshi

టీడీపీలో విస్తరిస్తున్న అంతర్గత విభేదాలు
అన్ని నియోజకవర్గాల్లోనూ అంతర్యుద్ధాలే...
ఎవరికి వారే యమునాతీరేలా సాగుతున్న కార్యక్రమాలు
మంత్రుల మధ్య కనిపించని సయోధ్య
ఎమ్మెల్యేలపై స్థానిక ప్రజాప్రతినిధుల అసంతృప్తి
నియోజకవర్గాల్లో ఎటూ తేలని పంచాయతీలు
రాష్ట్ర అధిష్టానం వద్దే  తేల్చుకోవాలనుకుంటున్న నేతలు


సాక్షి ప్రతినిధి, విజయనగరం: క్రమశిక్షణకు మారుపేరంటూ ప్రచారం చేసుకుంటున్న తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు పెచ్చుమీరుతోంది. ఎక్కడికక్కడే నాయకుల మధ్య వివాదాలు రచ్చకెక్కుతున్నాయి. అన్ని నియోజకవర్గాల్లోనూ విభేదాలు బట్టబయలవుతున్నాయి. సర్పంచ్‌ల నుంచి మంత్రుల వరకూ ఒకరంటే ఒకరికి పడటం లేదు. చివరికి జిల్లాలో ఈ వివాదాలు పరిష్కారం కాక ఇక రాష్ట్ర అధిష్టానం వద్దే తేల్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారాలు పాపం పార్టీనే నమ్ముకున్న కేడర్‌లో సందిగ్ధం నెలకొంటోంది.

జామిలో జెంటిల్‌మన్‌ ఒప్పందం ఉల్లంఘన
ఎస్‌.కోట నియోజకవర్గం జామి ఎంపీపీ పదవిని రెండున్నరేళ్లు చొప్పున పరసాన అప్పయమ్మ, ఇప్పాక చంద్రకళ పంచుకోవడానికి టీడీపీ పెద్దలు అప్పట్లో జెంటిల్‌మన్‌ ఒప్పందం కుదిర్చారు. ఇప్పుడు ఆ పదవిని వదిలిపెట్టడానికి అప్పయమ్మ ఇష్టపడటం లేదు. ఇక చేసేది లేక చంద్రకళ మంత్రి సుజయ కృష్ణరంగారావును కలి సి న్యాయం చేయాలని కోరేందుకు యత్నిస్తున్నా ఆయన ముఖం చాటేశారు. ఒప్పందం ప్రకారం అప్పయమ్మ చేత రాజీనామా చేయించకపోతే ధర్నాకైనా వెనుకాడబోమని వారు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ మంత్రి కూడా ఈ సమస్యను పరిష్కరించలేరన్న వాదన వినిపిస్తోంది.

తెలుగు యువత అధ్యక్ష పదవిపై వివాదం
జిల్లా తెలుగు యువత అధ్యక్ష పదవి మాజీ మంత్రి మృణాళిని తన కుమారుడు నాగార్జునకు ఇప్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనికి ప్రస్తుత అధ్యక్షుడు కర్రోతు నర్శింగరావు అడ్డుపడుతున్నారు. తనకు వేరే పదవి చూపించకుండా తన పదవిని ఎలా తీసుకుంటారంటూ మొండికేస్తున్నారు. మృణాళినికి మద్దతుగా ఎమ్మెల్యేలు కె.ఎ. నాయుడు, కోళ్ల లలితకుమారి, కర్రోతుకు మద్దతుగా ఎమ్మెల్యేలు నారాయణస్వామి నాయుడు, చిరంజీవి నిలవడంతో ఎమ్మెల్యేల మధ్య చీలికలు ఏర్పడ్డాయి. ఇంకా కొలిక్కి రాని ఈ వివాదం చివరికి ఏ పరిణామాలకు దారితీస్తుందో తెలియడం లేదు.

మీసాలపై కెంగువ గరం గరం...
విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీతకు స్థానిక ఎంపీపీతో పొసగడం లేదు. ఇటీవల జరిగిన మండల సర్వసభ్య సమావేశం సాక్షిగా వీరి మధ్య విభేదాలు వీధిన పడ్డాయి. మండల పరిషత్‌ అధ్యక్షురాలిగా ఉన్న తనకు తన మండలంలో జరిగే కార్యక్రమాల గురించి సమాచారం ఇవ్వకపోవడమేమిటని ఎంపీపీ కెంగువ ధనలక్ష్మి బహిరంగంగానే ఎమ్మెల్యే గీతను నిలదీశారు. దీనిపై కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు నివాసంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో శనివారం పంచాయితీ పెట్టారు. తమకెందుకు సమాచారం ఉండటం లేదని ఎమ్మెల్యే గీతను వైస్‌ ఏంపీపీ వి.శ్రీనివాసరావు, ఎంపీపీ ధనలక్ష్మి కుమారుడు శ్రీనివాసరావు ప్రశ్నించడంతో మీకు చెప్పాల్సిన అవసరం లేదని ఆమె సమాధానమిచ్చారు. అంతటితో ఆగకుండా సమావేశం నుంచి అర్ధంతరంగా ఆమె వెళ్లిపోయారు. దీంతో పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు కలిసి తమకు తెలియజెప్పకుండా ఎమ్మెల్యే ఎలాంటి కార్యక్రమాన్ని చేయకూడదనే తీర్మానాన్ని రాష్ట్ర పార్టీ అధిష్టానానికి పంపించాలని నిర్ణయించారు.

మృణాళినిపై తిరుగుబాటు బావుటా...
ఎమ్మెల్యే కిమిడి మృణాళికి, జడ్పీటీసీ మీసాల మరహాలనాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు రౌతు కామునాయుడికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తమను కనీసం పట్టించుకోవడం లేదంటూ వారు ఎప్పటి నుంచో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా 500 ఇళ్లు మంజూరైతే మృణాళిని అన్ని ఊళ్లకు పంచడం వారికి నచ్చలేదు. కనీసం తమ సూచనలు కూడా తీసుకోకపోవడమేమిటంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మంత్రి సుజయ తమ్ముడు బేబీ నాయన నియోజకవర్గానికి రావడంతో ఆయన ఎదుట తమ గోడు వినిపించారు. మంత్రిని కలిసే ఏర్పాటు చేస్తే అన్ని విషయాలు వివరిస్తామని చెప్పారు. దీంతో ఆయన అక్కడి నుంచే మంత్రితో మాట్లాడి అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. ఈ విషయం తెలిసి మాట్లాడదాం రమ్మని ఎమ్మెల్యే పిలిచినా వారు వెళ్లలేదు.

బొబ్బిలిలో ఇంటిపోరు
బొబ్బిలి పట్టణ అధ్యక్ష పదవిని బొబ్బాది తవిటి నాయుడుకు ఇవ్వాలని మంత్రి సుజయ్‌ భావించారు. కానీ దానికి మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ చోడిగంజి రమేష్‌నాయుడు, ఆ పదవి ఆశిస్తున్న రాంభట్ల శరత్‌ అడ్డుతగులుతున్నారు. దీంతో ఎటూ తేల్చ లేక ఈ అంశాన్ని పక్కనపెట్టేశారు.

నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడుకు పూసపాటిరేగ జెడ్పీటీసీ సభ్యుడు ఆకిరి ప్రసాద్‌కు మధ్య ఇసుక అక్రమ రవాణా, పరిశ్రమలకు నీటి సరఫరా విషయాల్లో వివాదాలు ఏర్పడ్డాయి. వీటిపై రోడ్డెక్కి మరీ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా ఆకిరి ప్రసాద్‌కు జిల్లా పార్టీ కొత్త అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు మద్దతుగా నిలవడంతో వివాదం తీవ్రత పెరిగింది.

గంటాతో కొత్త తంటా...
జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి గంటా శ్రీనివాసరావు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి విషయంలో తలదూర్చడమే కాకుండా తన పంతం నెగ్గించుకున్నారు. గత అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ను కొనసాగించాలన్న కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు యత్నాలను కొల్లగొట్టారు. ఈ పరిణామంతో జిల్లాలో టీడీపీ నేతల ప్రాభవంపై నీలినీడలు కమ్ముకున్నాయి. పక్క జిల్లా మంత్రి పెత్తనం చెలాయించే పరిస్థితి రావడానికి ఇక్కడి నాయకుల సమర్ధతపై అధిష్టానానికి నమ్మకం సడలడమే కారణమని కేడర్‌ భావిస్తోంది. మంత్రి గంటా, కేంద్ర మంత్రి అశోక్‌ మధ్య జిల్లా కమిటీల నియామకాల విషయంలో తలెత్తిన వివాదం వారి మధ్య అఖాతాన్ని పెంచుతోంది.

 ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లోనూ వీరిద్దరూ కలిసి పాల్గొనడం లేదు. అశోక్‌ పాల్గొనని కార్యక్రమాల్లో గంటా ఉంటున్నారు. గంటా లేనప్పుడు మాత్రమే అశోక్‌ హాజరవుతున్నారు. ఇటీవల జరిగిన జిల్లా టీడీపీ కార్యవర్గ సమావేశానికి గంటా శ్రీనివాసరావు రాలేదు. గజపతినగరంలో జరిగిన కార్యక్రమంలో అశోక్‌ లేరు. ఒకపైపు అవినీతి, అక్రమాల ఆరోపణలతో మసకబారుతున్న టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య తాజా వివాదాలు పార్టీని ఛిన్నాభిన్నం చేసే దిశగా పయనింపజేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement