కార్డు పోతే..? | if ATM card, PAN Card, Driving licence, voter card missing | Sakshi
Sakshi News home page

కార్డు పోతే..?

Published Thu, Feb 6 2014 5:48 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM

if ATM card, PAN Card, Driving licence, voter card missing

ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్: ఇప్పుడు ఎవరిజేబులో చూసినా పచ్చనోట్ల కన్నా ఎక్కువ కార్డులే కనిపిస్తున్నాయి. ఏటీఎం కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌లెసైన్స్, ఓటర్ గుర్తింపుకార్డు, ఆధార్‌కార్డు...ఇలా అన్నీ కార్డులే ఉంటున్నాయి. ఒకవేళ వీటిని పోగొట్టుకుంటే మళ్లీ ఎలా పొందాలో తెలియక చాలామంది ఆందోళన చెందుతుంటారు. పోయిన కార్డుల స్థానంలో కొత్తకార్డులను ఎలా పొందాలో తెలిపేదే ఈ కథనం...
 
 పాన్‌కార్డు...        
 ఈ రోజుల్లో ఉద్యోగులు, వ్యాపారులతోపాటు సామాన్యులు సైతం పాన్‌కార్డు తీసుకుంటున్నారు. దీన్ని పోగొట్టుకుంటే దీనికి సంబంధించిన ఏజెన్సీలో ఫిర్యాదు చేయాలి. దీనికి పాన్‌కార్డు నంబర్, కలర్‌ఫొటో, నివాస ధృవీకరణపత్రం లేదా రేషన్‌కార్డు జిరాక్స్ జతచేయాలి. దరఖాస్తుకు రూ.5, మరో కార్డు మంజూరు చేసేందుకు రూ.60 వసూలు చేస్తారు. విచారించి 20 రోజుల్లోపు పాన్‌కార్డు పంపిస్తారు.
 
 రేషన్‌కార్డు పోతే...
  ప్రస్తుతం రేషన్‌కార్డు ప్రాధాన్యత ఎక్కువే. దీని ద్వారా సరుకులు పొందడంతో పాటు, బ్యాంకు అకౌంట్లు, సిమ్‌కార్డులు పొందటం ఇలాంటి వాటన్నింటికీ దీన్నే ఉపయోగిస్తారు. ఒకవేళ రేషన్‌కార్డు పోగొట్టుకుంటే ముందుగా తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి. దానికోసం రూ.10 లేదా 20 చెల్లిస్తే దీని స్థానంలో మరోకార్డును అందజేస్తారు. ఇలాగే ఓటరు గుర్తింపు కార్డు కూడా పొందవచ్చు. ఒకవేళ కార్డు నంబర్ తెలిసి ఉంటే అప్పటికప్పుడే మీ సేవాలో నామమాత్రపు ఖర్చుతో పొందవచ్చు.
 
  పట్టాదారు పాసుపుస్తకం...
   పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ పోతే ముందుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. అక్కడ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా పత్రికల్లో ప్రకటించాలి. ఏ ప్రాంతానికి చెందుతారో అక్కడ ఉన్న అన్ని బ్యాంకుల నుంచి ఒక ధ్రువీకరణ పత్రాన్ని పొందాలి. ఏ బ్యాంకులోనూ వీటిని తాకట్టు పెట్టలేదనే పత్రాన్ని సమర్పించాలి. వీటితో పాటు పట్టదారు పాసుపుస్తకానికి రూ.1000, టైటిల్ డీడ్ కోసం రూ.100 చలానా తీసి మీసేవాలో దరఖాస్తు చేస్తే మళ్లీ పొందవచ్చు.
 
 ఏటీఎం కార్డయితే...
  ఏటీఎం కార్డును పోగొట్టుకుంటే మాత్రం వెంటనే అప్రమత్తం కావాలి. లేదంటే అకౌంట్‌లోని డబ్బులను భారీగా నష్టపోయే అవకాశముంది. ఈ కార్డు ఎవరికైనా దొరికితే దానిద్వారా డబ్బులు తీయలేకపోయినప్పటికీ... విచ్చల విడిగా షాపింగ్ చేసే ప్రమాదం ఉంది. అందుకే కార్డు పోయిన వెంటనే సంబంధిత బ్యాంకుకు చెందిన వినియోగదారుల సేవా కేంద్రానికి ఫోన్ చేసి కార్డును బ్లాక్ చేయించాలి. ఆ తర్వాత బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేస్తే ముందుగా మన చిరునామాకు కార్డు పంపిస్తారు. ఆ తర్వాత వారం రోజులకు రహస్య పిన్‌కోడ్ నంబర్ ఇస్తారు.

Advertisement
 
Advertisement
 
Advertisement