భారీగా టీచర్ల బదిలీలు | huge number of teachers transferred | Sakshi
Sakshi News home page

భారీగా టీచర్ల బదిలీలు

Published Wed, Feb 5 2014 2:39 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

huge number of teachers transferred

 జిల్లా విద్యాశాఖకు ప్రభుత్వ ఉత్తర్వులు
 జాబితాలో 45 మంది ఉపాధ్యాయులు
 అంతర్‌జిల్లా బదిలీల్లో ఇద్దరు
 త్వరలో మున్సిపల్ బదిలీల జాబితా?
 
 సాక్షి, విశాఖపట్నం :
 ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఉపాధ్యాయ బదిలీలు జోరందుకున్నాయి. పాఠశాల విద్యాశాఖ, ఆర్థిక శాఖ, ముఖ్యమంత్రి పేషీ నుంచి వందల సంఖ్యలో ఉపాధ్యాయులు ప్రత్యేక బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఇందులో జిల్లాకు చెందిన 30 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, 8 మంది స్కూల్ అసిస్టెంట్లు, ఐదుగురు ప్రధానోపాధ్యాయు(హెచ్‌ఎం)లు ఉన్నారు.
 
 అంతర్ జిల్లా బదిలీల్లో రాష్ట్రవ్యాప్తంగా తొలి జాబితాలో పది మంది ఉపాధ్యాయుల కు బదిలీకాగా.. విశాఖ జిల్లాకు శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉత్తర్వులు తెచ్చుకున్నారు. వీరిలో ఎక్కువగా పరస్పర(మ్యూచువల్) కేటగిరీలోనే బదిలీ ఉత్తర్వులు పొందినట్టు తెలిసింది. వీరందరి వ్యక్తిగత ఉత్తర్వులు జిల్లా విద్యాశాఖకు ఇప్పటికే అందాయి. ఇందుకు ఒక్కొక్కరు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు చెల్లించినట్టు సమాచారం.
 
 హెచ్‌ఎం బదిలీల్లో కంగాళీ? : తాజా జాబితాలో కొందరు హెచ్‌ఎంలను కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులొచ్చాయి. అయితే ఇవి ఆర్జేడీ(కాకినాడ) కార్యాలయానికి వెళ్లాయి. అక్కడి నుంచి జిల్లా విద్యాశాఖకు రావాల్సి ఉంది. వీరిలో ఇద్దరు పరస్పర బదిలీలు కోరుకున్నట్టు తెలిసింది. పెదమదీనా, మంగమారిపేట జెడ్పీ హైస్కూళ్ల హెచ్‌ఎంలు ఈ జాబితాలో ఉన్నారు. మరోవైపు మంగమారిపేట ప్రస్తుత హెచ్‌ఎం సెప్టెంబర్ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. చిట్టివలస హెచ్‌ఎం వాడపాలెం హైస్కూల్‌కు బదిలీ ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే వాడపాలెంలో ప్రస్తుతం పనిచేస్తున్న హెచ్‌ఎంకు ఇంకా సర్వీసు మిగిలే ఉంది. దీంతో ఈ హెచ్‌ఎంను ఏం చేస్తారన్న సందేహాలున్నాయి.
 
 త్వరలో ‘మున్సిపల్’ జాబితా?
 జిల్లా పరిషత్ యాజమాన్యం నుంచి మున్సిపల్ యాజమాన్యంలోకి వచ్చేందుకు కూడా చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఎనిమిది మందికి పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఆమోదం తెలిపినట్టు తెలిసింది. అయితే వీరికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ(ఎంఏయూడీ) ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఈ ఉత్తర్వుల్లో జాప్యం నెలకొన్నట్టు సమాచారం. ఈ వారంలోనే వీరికి కూడా వ్యక్తిగతంగా బదిలీ ఉత్తర్వులు రానున్నట్టు బోగట్టా.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement