ఇసుక నుంచి కాసులు పిండుతున్నారు | heavy price of selling of sand | Sakshi
Sakshi News home page

ఇసుక నుంచి కాసులు పిండుతున్నారు

Published Fri, May 29 2015 12:15 AM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM

ఇసుక నుంచి కాసులు పిండుతున్నారు

- ఆదాయమే లక్ష్యంగా  రీచ్‌ల నిర్వహణ
- ఆన్‌లైన్‌లోబ్లాక్ చేసి అధిక ధరలకు అమ్ముకుంటున్న బడాబాబులు
- కొనుగోలు చేయలేని స్థితిలో పల్లెవాసులు
- ముందుకు సాగని ఇళ్ల నిర్మాణాలు, అభివృద్ధి పనులు

దేవరాపల్లి:
ప్రభుత్వం ఏ కార్యక్రమాన్నయినా, ఏ పథకాన్నయినా పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని  రూపొందించాలి. కాని ప్రస్తుత ప్రభుత్వం సంపన్నులకు మేలు చేయడమే లక్ష్యంగా ఇసుక పాలసీని రూపొందించి  విమర్శల పాలవుతోంది. అందినంత ఆదాయాన్ని రాబట్టడమే లక్ష్యంగా రూపొందించిన ఇసుక పాలసీ పేద ప్రజల పాలిట శాపంగా, బడాబాబులకు  వరంగా మారింది. కష్టం లేకుండా కాసులు కురిపిస్తున్న ఇసుక ఆన్‌లైన్ అమ్మకాలపై పలువురు బడాబాబుల కన్నుపడటంతో సామాన్యుడికి ఇసుక దొరక్కుండా పోతోంది.

ఇసుక అమ్మకాలను ఆన్‌లైన్‌లో పెట్టిన క్షణాల్లోనే ఇసుక మాఫియా బినామీ పేర్లతో చలానాలు చెల్లించి బుక్ చేసి   బ్లాక్ చేస్తున్నారు. తరువాత ఇసుకను పట్టణ ప్రాంతాలకు తరలించి  అధిక ధరలకు అమ్మి దర్జాగా కోట్లు గడిస్తున్నారు.   అధికారుల అండతోనే ఇదంతా జరుగుతోందన్న విమర్శలు  వినిపిస్తున్నాయి.  

అసంపూర్తిగా ఇళ్ల నిర్మాణాలు
గ్రామం నడి ఒడ్డున శారద నదిలో కళ్లెదుట ఉన్న ఇసుకను తీసుకునే వీలులేకుండా చేయడంతో గ్రామస్తులు నిశ్చేష్ఠులుగా మిగిలిపోతున్నారు. సొంత ఇళ్లు నిర్మించుకుందామనుకున్నా  ఇసుక పాలసీ అంతరాయంగా మారింది. అసలే  సిమెంట్, ఇసుము, పిక్క వంటి ఇంటి సామగ్రి ధరలు విపరీతంగా పెరిగి పోయాయి. దీనికి తోడు ఇసుకను కూడా అధిక ధరలకు కొనుగోలు చేయలేక ఇళ్ల నిర్మాణాలను  నిలిపేస్తున్నారు.  

నిధులున్నా ప్రారంభం కాని  పనులు
గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరైనా  ఇసుక తరలింపుపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఇసుక ధరలకు భయపడి అభివృద్ధి పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాక పోవడంతో నిధులు మురిగిపోతున్నాయి.

టైరు బళ్లపై కేసులా?
గ్రామాల్లో సొంత అవసరాలకు టైరు బళ్లలో ఇసుకను తెచ్చుకుంటున్న  వారిపై కేసులు నమోదు చేయడం పట్ల  తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  కేసుల బారిన పడి ప్రజలు కోర్టుల చుట్టూ తిరుగుతూ నానా అవస్థలు పడుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement