రోగుల అందం.. అదిరిందయ్యా చంద్రం! | ESI scam in the name of hair oils and face creams to Workers | Sakshi
Sakshi News home page

రోగుల అందం.. అదిరిందయ్యా చంద్రం!

Published Sun, Feb 23 2020 1:34 AM | Last Updated on Sun, Feb 23 2020 5:00 AM

ESI scam in the name of hair oils and face creams to Workers - Sakshi

సాక్షి, అమరావతి: ఆసుపత్రిలో చేరిన కార్మికులకు నాలుగు మందు బిళ్లలివ్వండి మహాప్రభో అని మొత్తుకుంటే.. నిర్దాక్షిణ్యంగా నిధుల్లేవని చెప్పిన గత పాలకులు తైల సంస్కారం పేరుతో కోట్ల రూపాయలు నొక్కేసిన వైనం నివ్వెరపరుస్తోంది. జబ్బు చేస్తే మందులు కొనడానికి డబ్బుల్లేక నానా అవస్థలు పడుతున్న కార్మికులను కనీసం పట్టించుకోకుండా వారి జుట్టుకు, ఒంటికి నూనె రాయాలని కోట్లకు కోట్లు వెచ్చించి రకరకాల నూనెలు కాగితాలపై మాత్రమే కొనుగోలు చేసి, సరికొత్త కుంభకోణానికి పాల్పడటం వారికే చెల్లింది. ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో స్పెషాలిటీ వైద్యం లేక కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుని బిలులు పెడితే ఏళ్లతరబడి చెల్లించకుండా, వచ్చిన నిధులను ఇలా దిగమింగిన ఘటన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదికతో బట్టబయలైంది. రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఈఎస్‌ఐ అవినీతి అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. 

జుట్టు నూనెలకు రూ. 54 కోట్లు పైనే ..
‘మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె’అన్నట్లు ఓవైపు ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో మందులు లేకపోయినా మరోవైపు రకరకాల క్రీములు, నూనెల పేరిట నాలుగేళ్లలో రూ.54 కోట్ల విలువైనవి కొన్నారు. హెయిర్‌ సొల్యూషన్, స్కిన్‌ క్రీమ్స్, ఫేస్‌ క్రీమ్స్, టూత్‌ పేస్ట్‌లు ఇలా ఒకటేమిటి రకరకాల తైలాలు, క్రీముల పేరిట కోట్లాది రూపాయలు వ్యయం చేశారు. పోనీ ఆ నూనెలు, క్రీములు వాడారా అంటే అదీ లేదు. ఏ ఆస్పత్రి నుంచి కూడా తమకు నూనెలు, క్రీములు కావాలని ఒక్క చిన్న లెటర్‌ కూడా లేదు. ఈఎస్‌ఐ కార్యాలయం నుంచే ఇండెంట్‌లు సృష్టించి తమకు కావాల్సిన కంపెనీకి ఆర్డరు ఇచ్చారు.

ఒక్క జుట్టుకు రాసుకునే నూనెకు రూ.42 కోట్లు చెల్లించినట్టు తేలింది. టూత్‌పేస్ట్‌కు రూ.2 కోట్లు, షాంపూలకు రూ.2.5 కోట్లు చెల్లించారు. ఒంటికి రాసుకునే క్రీములకు రూ.8 కోట్లు పైనే వ్యయం చేశారు. ఓవైపు క్యాన్సర్, కిడ్నీ జబ్బులకు మందులు లేవంటూ బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నా పట్టించుకోకుండా కమీషన్ల కోసం అమాత్యుల నుంచి అధికారుల వరకు అందరూ ఈ అవినీతి సొమ్ముకు ఎగబడినట్టు విజిలెన్స్‌ నివేదిక బట్టబయలు చేసింది. ఇలా ఇండెంట్‌లు పెట్టిన అధికారుల్లో డా.చంద్రశేఖర్, డా.జగదీప్‌గాంధీలు ప్రధానంగా ఉన్నారు. వీరిద్దరూ లెజెండ్, ఓమినిమెడి కంపెనీలకు ఈ ఆర్డర్లు ఇచ్చినట్టు విజిలెన్స్‌ విచారణలో వెల్లడైంది. 

మందులు మురిగిపోతున్నా ..
ఓవైపు మందులు మురిగిపోయాతున్నా, మరోవైపు కమీషన్ల కోసం మందులకు ఆర్డర్లే ఆర్డర్లు. ఒక్క కడప రీజియన్‌లోనే రూ.15 కోట్ల విలువైన మందులు మురిగిపోయాయి. ఆయా ఆస్పత్రుల నుంచి పదే పదే మందులు మాకొద్దు అన్నా కూడా ఈఎస్‌ఐ కార్యాలయంలో పనిచేస్తున్న సంయుక్త సంచాలకులు కమీషన్ల కోసం ఆర్డర్లు పెట్టారు. 2019 అక్టోబర్‌ 1న కడప జేడీగా పనిచేస్తున్న డా.రవికుమార్‌ మందులు మురిగిపోతున్నాయని, వీటిని ఇతర ఆస్పత్రులకైనా తరలించి వాడుకోవాలని లేఖ రాశారు. ఇలా వరుసపెట్టి నాలుగైదు దఫాలుగా లేఖలు రాసినా పట్టించుకోలేదు. ఇలాంటి లేఖలు పలు జిల్లాల నుంచి వచ్చినా పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా మందులు సరఫరా చేయడంతో ఇప్పుడా మందులన్నీ మురిగిపోయాయి. ఆ మందుల విలువ కనీసం రూ.40కోట్ల వరకు ఉంటుందని అంచనా. 
విజయవాడ గుణదలలోని కార్మిక ప్రభుత్వ భీమా వైద్యశాల 

ఆ రెండు ఏజెన్సీల హవా 
అధికారులను, కొంతమంది నేతలను అడ్డుపెట్టుకుని ఇప్పటికీ తిరుమల ఏజెన్సీ, సాయి సుదర్శన ఏజెన్సీ ప్రతినిధులు హవా కొనసాగిస్తున్నట్టు తేలింది. తాజాగా ఓడీసీఎస్‌ (ఒరిస్సా డ్రగ్స్‌ అండ్‌ కెమికల్స్‌) నుంచి కొనుగోలు చేసిన పారాసెటిమాల్‌ మాత్రలు నాసిరకం అని తేలినా ఇప్పటికీ చర్యలు లేవు. ఈ రెండు ఏజెన్సీలకు సంబంధించిన ప్రతినిధులకు అటు అధికారుల్లో, ఇటు నేతల్లో బాగా లాబీ ఉండటంతో కింది స్థాయి సిబ్బంది భయపడుతున్నారు. అందుకే నాసిరకం అని తేలినా చర్యలకు వెనుకాడుతున్నట్టు తేలింది. 

ల్యాబ్‌ కిట్ల పేరుతో భారీ దోపిడీ  
షుగర్, థైరాయిడ్‌ పరీక్షలకు వాడే ల్యాబొరేటరీ కిట్ల పేరిట భారీ దోపిడీకి పాల్పడినట్టు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. వీటి సరఫరా బాధ్యత ఓమినీ మెడీ, ఎవెంటార్, లెజెండ్‌ కంపెనీలకు ఇచ్చారు. వీటి కోసం ఏకంగా రూ.237 కోట్లు ఈ మూడు కంపెనీలకు చెల్లించారు. హద్దూ పద్దూ లేకుండా వీటిని పదిరెట్లు ఎక్కువ పెట్టి కొనుగోలు చేసినట్టు విజిలెన్స్‌ అధికారుల పరిశీలనలో వెల్లడైంది. అంతేకాకుండా కొన్ని వస్తువులు ఆస్పత్రులకు వెళ్లకుండానే బిల్లులు చెల్లించారు. ఎక్స్‌పెయిరీ తేదీ దగ్గరకు వచ్చిన వాటిని సరఫరా చేసినా కూడా కిమ్మనకుండా నిధులు చెల్లించినట్టు తేలింది. రకరకాల ల్యాబ్‌ కిట్ల వాస్తవ ధర, ఈఎస్‌ఐ కొనుగోలు చేసిన ధర ఇలా ఉంది.  

రికార్డులు తారుమారు చేసే అవకాశం 
ఈఎస్‌ఐలో జరిగిన అక్రమాల్లో ఎవరైతే అధికారులు బాధ్యులుగా ఉన్నారో వారిని అలాగే కొనసాగిస్తే రికార్డులు తారుమారు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇందులో మాజీ మంత్రులు, కొంత మంది రాజకీయ నేతలు ఉండటంతో అధికారులపై ఒత్తిళ్లు పెరిగాయి. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వారిని తక్షణమే సస్పెండ్‌ చేస్తేనే రికార్డులు తారుమారు చేసే అవకాశం ఉండదని, లేదంటే ఇప్పటికే దీనిపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈఎస్‌ఐ కార్యాలయంలో కొంత మంది కింది స్థాయి సిబ్బంది ఇప్పటికే ఇదే పనిలో ఉన్నట్టు సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement