రాజకీయ బది‘లీలలు’ | all officers tranfered in political way | Sakshi
Sakshi News home page

రాజకీయ బది‘లీలలు’

Published Wed, Feb 5 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM

all officers tranfered in political way

 జిల్లాలో 33 మంది టీచర్లకు గ్రీన్‌సిగ్నల్
 డీఈవో కార్యాలయానికి చేరిన ఉత్తర్వులు
 నేతల ‘హస్తం’
 
 సాక్షి, మచిలీపట్నం :
 కోరుకున్నచోటు ఉంటుందో లేదో అన్న ఆందోళన.. రోజులతరబడి మానసిక ఒత్తిడి.. గంటల తరబడి నిరీక్షణ.. ఇదీ టీచర్లకు నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియలో వారు అనుభవించే వేదన. ఇటువంటి కష్టాలకు చెల్లుచీటీ రాస్తూ.. రాజకీయ నేతల అభయహస్తం ఉంటే చాలు అడ్డదారిలో కావాల్సినచోటకు బదిలీ చేయిచుకోవచ్చని పలువురు గురువులు రుజువు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గురుకులం (టీచర్ల కమ్యూనిటీ)లో కాస్త పట్టు సాధించడంతో పాటు నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చని భావించిన అధికార పార్టీ నేతలు ఈ ప్రక్రియకు తెరతీశారు. దాదాపు మూడు నెలలుగా సాగిన ఉపాధ్యాయ బదిలీలకు సీఎం సోమవారం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అందుకు సంబంధించిన ఉత్తర్వులు మంగళవారం జిల్లాకు చేరాయి. రాష్ట్రంలో సుమారు 600 మంది ఉపాధ్యాయుల బదిలీలకు ఆమోదముద్ర వేయగా జిల్లాలో 33 మంది ఉన్నారు.
 
 కోరుకున్న ప్రాంతాలకు బదిలీ...
 జిల్లాలో 33 మంది ఉపాధ్యాయులను వారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేస్తూ వ్యక్తిగత ఉత్తర్వులు వచ్చాయి. జిల్లాలోని కాంగ్రెస్ నేతలు తమను ఆశ్రయించిన ఉపాధ్యాయులకు బదిలీలు చేయించుకున్నారు. జిల్లాలో బదిలీ అయిన 33 మంది టీచర్లలో స్కూల్ అసిస్టెంట్లు 20 మంది, సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్‌డీటీ)లు ఐదుగురు, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలు ఐదుగురు, స్కూల్ అసిస్టెంట్లు (హిందీ) ముగ్గురు ఉన్నారు.
 
 ఉత్తర దక్షిణాలతో ప్రయత్నం సఫలం...
 అందరితో పోటీపడి కౌన్సెలింగ్‌కు వెళితే కావాల్సినచోటు ఉంటుందో లేదో అనుకునే ఉపాధ్యాయులు ఈసారి రాజకీయ అస్త్రాన్ని ఆశ్రయించారు. అందుకు వారు ఉత్తర దక్షిణా(సిఫారసు, డబ్బు)లను ప్రయోగించారు. కాంగ్రెస్ నేతల సిఫారసుతో పలువురు టీచర్లు తమకు కావాల్సినచోటుకు మార్పించుకునేందుకు ఒక్కొక్కరు రూ.1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు సమర్పించుకున్నట్టు సమాచారం. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో జరిగిన ఈ బదిలీలతో వేసవిలో జరిగే కౌన్సెలింగ్‌కు ఇబ్బందికరమేనని విద్యావేత్తలు అంటున్నారు. దీంతో వచ్చే వేసవిలో నిర్వహించే బదిలీల కౌన్సెలింగ్‌కు మిగిలే ఉపాధ్యాయులకు కనీస సౌకర్యాలు లేని, మారుమూల పాఠశాలలే దిక్కని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 ఉత్తర్వులను అమలు చేస్తాం : డీఈవో
 జిల్లాలో 33 మంది ఉపాధ్యాయులను బదిలీ చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాణీమోహన్ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తున్నట్టు డీఈవో డి.దేవానందరెడ్డి ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. ఉపాధ్యాయుల బదిలీలకు వ్యక్తిగత ఉత్తర్వులు ఇచ్చినందున వారికి అందజేస్తామని తెలిపారు. ప్రస్తుతం వారికి కేటాయించిన పాఠశాలల్లో ఒకవేళ ఇటీవల భర్తీ అయ్యి ఖాళీ లేకపోతే పక్క మండలాల్లో నియమించేలా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారని డీఈవో చెప్పారు. దీని ప్రకారం 33 మంది టీచర్లలో సుమారు నలుగురు వరకు వారు గతంలో కోరుకున్న పాఠశాలల్లో ఖాళీలు లేవని, వారికి పక్క మండలాల్లో కోరుకున్న పాఠశాలకు బదిలీ చేస్తామని ఆయన వివరణ ఇచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement