ఏసీబీ వలలో.. సెస్ జేఎల్‌ఎం | ACB attack To Agricultural power connection srinivas | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో.. సెస్ జేఎల్‌ఎం

Published Sat, Jan 4 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM

ACB attack To Agricultural power connection srinivas

 ఎల్లారెడ్డిపేట, న్యూస్‌లైన్ : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) పరిధిలోని ఎల్లారెడ్డిపేటలో జూనియర్ లైన్‌మన్‌గా పనిచేస్తున్న గుర్రం శ్రీనివాస్ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. కరీంనగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ టి.సుదర్శన్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కుంచం రాజవ్వ అనే మహిళా రైతు వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ మీటరుకోసం దరఖాస్తు చేసుకుంది.
 
 మీటరు మంజూరు చేయాలంటే రూ.17వేలు లంచం ఇవ్వాలని జూనియర్ లైన్‌మన్ శ్రీనివాస్ డిమాండ్ చేశాడు. దరఖాస్తు సమర్పిస్తున్నప్పుడే ఫైల్ కదలాలంటే రూ.500 చెల్లించాలని అడగడంతో రాజవ్వ కుమారుడు రవి డబ్బులు ఇచ్చాడు. అప్పటినుంచి మూడు నెలలుగా మీటరు కోసం శ్రీనివాస్ చుట్టూ తల్లీకొడుకులు తిరుగుతున్నారు.
 
 తాజాగా ఎస్టిమేషన్ కోసం రూ.7500 చెల్లించాలని శ్రీనివాస్ డిమాండ్ చేయడంతో గురువారం ఏసీబీని ఆశ్రయించారు. ఈ మేరకు శుక్రవారం మండల కేం ద్రంలోని సెస్ కార్యాలయం వద్ద శ్రీనివాస్‌ను కలిసిన రవి ఆయనకు రూ.7500 ఇవ్వగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డబ్బులను స్వాధీనం చేసుకుని శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని శనివారం ఏసీబీ కోర్టులో హాజరుపర్చుతామని డీఎస్పీ తెలిపా రు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు వీవీ.రమణమూ ర్తి, జె.శ్రీనివాస్‌రాజ్, సిబ్బంది పాల్గొన్నారు.
 
 లంచంకోసం వేధించాడు
 లంచం ఇస్తేనే కరెంటు కనెక్షన్ ఇస్తానని చప్పులరిగేలా తిప్పించుకున్నాడు. మేము పేదోళ్లమని ప్రాధేయపడినా వినిపించుకోలేదు. సెస్ ఏఈని కలిస్తే జూనియర్ లైన్‌మన్‌నే కలవాలన్నాడు. గత్యంతరం లేక కరీంనగర్ వెళ్లి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాం.
 - కుంచం రవి, రైతు, ఎల్లారెడ్డిపేట
 
 లంచం అడిగేందుకు భయపడాలి
 జిల్లాలో వరుసగా దాడులు చేస్తూ ఎంతోమంది అవినీతిపరులను పట్టుకుంటున్నాం. అయినా లంచగొడుల తీరు మారకపోవడం బాధాకరం. ప్రభుత్వోద్యోగులు లంచం అడిగేందుకు భయపడే పరిస్థితి రావాలంటే.. ప్రజలు మాకు ఎప్పుటికప్పుడు సమాచారం అందించాలి.
 - టి.సుదర్శన్‌గౌడ్, ఏసీబీ డీఎస్పీ
 

Advertisement
 
Advertisement
Advertisement