పోతూ పోతూ సంతకం.. | 600 teachers transfered after Kiran kumar reddy signs | Sakshi
Sakshi News home page

పోతూ పోతూ సంతకం..

Published Fri, Feb 21 2014 2:23 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

పోతూ పోతూ సంతకం.. - Sakshi

* 600 మంది టీచర్ల బదిలీ
* రాజీనామాకు ఒక్కరోజు ముందు
ఫైలుపై సీఎం సంతకం
* పరీక్షల ముందు విద్యార్థులకు చేటు
* సెలవులో ఉన్న కార్యదర్శి
* ఆదేశాలు ఇస్తారా లేదా ప్రశ్నార్థకం
 
 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామాకు ముందు రోజు అంటే మంగళవారం రాత్రి ఒక్క సంతకంతో 600 మంది టీచర్లను బదిలీ చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో టీచర్లను బదిలీ చేయకూడదనే నిబంధనలున్నా వాటికి పాతర వేసి మరీ ఒకేసారి 600 మంది టీచర్లను వారు కోరుకున్న చోటకు బదిలీ చేసేశారు. ఒక్కో బదిలీ వెనుక రూ.50 వేల నుంచి లక్ష దాకా చేతులు మారినట్లు సచివాలయం కోడై కూస్తోంది. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా విద్యా సంవత్సరం మధ్యలో ఇంత పెద్ద ఎత్తున బదిలీలు చేయలేదని అధికారులే పేర్కొనడం గమనార్హం. ఎన్నికల ముందు మరీ నిబంధనలను సడలించి విద్యా శాఖ, ఆర్థిక శాఖ, ముఖ్యమంత్రి తమకున్న విశేష అధికారాలతో ఈ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విద్యా సంవత్సరం మధ్యలో అదీ వార్షిక పరీక్షల ముందు ఇంత పెద్ద ఎత్తున టీచర్లను బదిలీ చేయడం దారుణమని అధికార వర్గాలు వాపోతున్నాయి. మధ్యలో టీచర్ల బదిలీ వల్ల విద్యార్థులకు నష్టం చేకూరుతుందనే ఆలోచనతోనే ప్రతి ఏటా వేసవి సెలవుల్లో కౌన్సెలింగ్ ద్వారా బదిలీలకు అవకాశం కల్పిస్తున్నామని, ఇప్పుడు విద్యార్థుల గురించి ఆలోచించకుండా రాజకీయ బదిలీలు చేశారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
 
  గతంలో కూడా 400 మందికి పైగా టీచర్లను ఇదే విధంగా బదిలీ చేసిన విషయాన్ని సాక్షి వెల్లడించిన విషయం తెలిసిందే. మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫార్సులతో ఈ టీచర్ల బదిలీలు సాగాయి.  ఇలా ఉండగా మంగళవారం ముఖ్యమంత్రి సంతకం చేయడంతో బుధవారం ఆ బదిలీల ఫైళ్లను ఆదేశాల జారీ కోసం మాధ్యమిక విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారీకి పంపించారు. తివారీ ఈ నెల 24 వరకు సెలవులో ఉన్నారు. ఆయన సెలవు నుంచి వచ్చే వరకు ఆ బాధ్యతలను ఉన్నత విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రాకు అప్పగించారు. అయితే అజయ్ మిశ్రా కూడా ముఖ్యమంత్రి రాజీనామా చేసినందున ఇప్పుడు బదిలీల ఆదేశాలు జారీ చేయడం ఎందుకనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. తివారీ కూడా ఇదే ఆలోచనలో ఉన్నారనే అభిప్రాయం శాఖ అధికారుల్లో వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచనల మేరకు ముందుకు వెళ్లాలనే ఆలోచనలో విద్యాశాఖ అధికారులు ఉన్నట్లు సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement