రాజకీయ ఒత్తిళ్లు | రాజకీయ ఒత్తిళ్లు | Sakshi
Sakshi News home page

రాజకీయ ఒత్తిళ్లు

Published Mon, Nov 25 2013 3:01 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

రాజకీయ ఒత్తిళ్లు

ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్:ఏళ్ల తరబడి పెండింగులో ఉండిపోయి న బోధకుల నియామక ప్రక్రియ మళ్లీ ఊపందుకున్న తరుణంలో అదేస్థాయిలో రాజకీ య ఒత్తిళ్లు తీవ్రతరమవుతున్నాయి. ఈ ఒత్తిళ్లను అధిగమించేందుకు ప్రయత్నిస్తూనే మరోపక్క నియామకాల ఫైలు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం అధికారులు సిద్ధం చేసి, గవర్నర్ నామినీ ఆమోదం కోసం పంపారు. స్థానికంగా జరగాల్సిన మిగతా ప్రక్రియను కూడా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. అన్నీ అనుకున్నట్లు జరి గితే త్వరలోనే ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశం ఉంది.
 
 యూనివర్సిటీ ఏర్పాటైన తర్వాత 2009లో మాత్రమే నియామకాలు జరిగాయి. అప్పట్లో కొత్తగా ప్రారంభించిన బయోటెక్నాలజీలో నలుగురు, సోషల్ వర్కులో ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించారు. కానీ 2008 జూన్ 25న యూనివర్సిటీ ఏర్పడిన నేపథ్యంలో అప్పటి వరకు ఇక్కడ పనిచేస్తూ మాతృసంస్థ ఏయూకు వెళ్లిపోయిన బోధకుల స్థానంలో కొత్తవారిని నియమించలేదు. ఫలితంగా వర్సిటీ పలు విధాలుగా నష్టపోతోంది. యూజీసీ12బి గుర్తింపుతోపాటు, ఆ సంస్థ నిధులకూ నోచుకోవడంలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులపైనే ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు బోధన కుంటుపడుతోంది. ప్రస్తుతం కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్‌లో ఇద్దరు, రూరల్ డెవలప్‌మెంట్‌లో ఇద్దరు, ఎకనామిక్స్‌లో ఒక ప్రొఫెసర్ మాత్రమే ఉన్నారు. ఇంతకాలం ఒప్పంద బోధకులతోనే నెట్టుకొస్తున్నారు.
 
 ‘సాగు’తున్న నియామక ప్రక్రియ
 బోధన సిబ్బంది లోటును పూడ్చేందుకు 2011లో చేపట్టిన నియామక ప్రక్రియ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఆ ఏడాది జనవరిలో 34 మంది బోధకుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే నిర్ణీత కాలపరిమితిలోగా నియామకాలు జరపలేకపోయారు. దాంతో అవే పోస్టులకు ఈ ఏడాది జూన్ 22న మళ్లీ 8 ప్రొఫెసర్, 7 అసోసియేట్ ప్రొఫెసర్, 19 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 512 దరఖాస్తులు అందగా,  పరిశీలన అనంతరం 400 దరఖాస్తులు అర్హమైనవిగా నిలిచాయి. అభ్యర్థుల అర్హతలు, అనుభవం ఆధారంగా ఒక జాబితా సిద్ధం చేశారు. మరోవైపు ఉన్నత విద్యామండలి ఇటీవలే 15 పోస్టులు మంజూరు చేయడంలో ప్రస్తుత నియామక ప్రక్రియ పూర్తి అయిన వెంటనే మరో నోటిఫికేషన్ జారీకి వర్సిటీ అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే గవర్నర్ నామినీ నియామకం ఇక్కడ కీలకం. దాని కోసమే వర్సిటీ అధికారులు ఎదురుచూస్తున్నారు. ఆ నియామకం జరిగిన వెంటనే ఇక్కడ నియామక ప్రక్రియ తుది అంకానికి చేరుకుంటుంది.
 
 రాజకీయ సిఫార్సులు
 అర్హుల జాబితా సిద్ధం చేసిన వర్సిటీ అధికారులు ఇంటర్వ్యూలకు సిద్ధమవుతున్న తరుణంలోనే రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. వర్శిటీలో కొన్నేళ్లుగా ఒప్పంద బోధకులుగా పని చేస్తున్న వారు, ఈ పోస్టులపై ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎప్పటికైనా రెగ్యులర్ అవుతామన్న ఆశతో బయట నుంచి వచ్చే అవకాశాలను సైతం వదులుకుంటున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో నియామకాలు జరిగితే తాము నష్టపోతామని వీరు ఆందోళన చెందుతున్నారు. కాగా నెట్,స్లెట్, డాక్టరేట్ వంటి అర్హతలున్నవారికి  అవకాశం ఇవ్వక తప్పదు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఆశించే వారు తప్పనిసరిగా ఏదో ఒక యూనివర్సిటీలో పనిచేస్తున్న వారై ఉండాలి. అక్కడి సీనియారిటీని వదులుకోవడానికి సిద్ధపడాలి. ఇవన్నీ తెలిసినా.. చాలా మంది అభ్యర్థులు రాజకీయ సిపార్సులతో వ ర్సిటీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రుల సిపార్సు లేఖలతో రోజూ పదుల సంఖ్యలో అభ్యర్థులు వీసీ కార్యాలయానికి వస్తున్నారు. మరికొందరు ప్రలోభాలు చూపి పోస్టులు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
 
Advertisement